పుణ్యానికి పోతే…ఏదో అన్నట్లు కోట్లు పెట్టినా కూడా తెలుగు సినిమా వజ్రోత్సవాలు అన్ని స్థాయిల నుంచి తెలుగు చిత్ర పరిశ్రమకు విమర్శలు, తిట్లు తెచ్చి పెట్టాయి. తాతకు నేర్పకండి దగ్గులు అన్నట్లు తెలుగు చిత్ర పరిశ్రమ ఎగుడు, దిగుడుకు సాక్షులైన ప్రేక్షకులూ చిరాకు పడుతున్నారు. మన సినిమాల మహత్యం గురించి మనకు తెలియక ఇంకెవరికి తెలుస్తుంది? . అదీ కాక కె.యస్.ఆర్ (ఏంటో ఇలాంటి పేర్లున్న వారికి నోటి దురద ఎక్కువనుకుంటా) పత్రికల మీద నోరు పారేసుకోవటం. అంత కంటే తేనె తుట్టలో నోరు పెట్టి తేనె తాగటం సులభం. ఏది ఏమైనా తెలుగు చిత్ర పరిశ్రమ నిజాయతీగా తన రోగాన్ని బయట పెట్టుకుంది. ఈ సందర్భంగా అందరూ (టీవిలలో, పత్రికలలో, బ్లాగులలో) అనుకుంటున్న విషయాలు…
గత డభ్భయి ఐదు వత్సరాలలో
౦౧. సినిమా : విలువలు (కుటుంబ, నైతిక, చట్ట, వినోద పరమైన) నాశనం అయిపోయాయి. సుమోలలో కత్త్లులు తిప్పతూ రోడ్లపై వెళ్ళటం, తల అడ్డంగా నరికెయ్యటం (పాతాల భైరవిలో దృశ్యానికి ఇప్పటికీ ఎంత తేడా? ). వికలాంగులపై జోకులు, శారీరక అవస్థలపై జోకులు, ప్రాంతీయ యాసలపై జోకులు ..ఓహ్ ఒకటేమిటి…అంతా కలపి చూస్తే మన సినిమా దేహం ఒక అష్టావక్ర అని చెప్పుకోవచ్చు.
౦౨. హీరోలు : కధ కాకుండా, పాత్రలు హీరోలు గా మారారు. హీరో గారి కధే సినిమా…వారికి కధ నచ్చాలి. అది అరువు తెచ్చుకున్న కధ అయితే మన హీరో గారి ఇమేజ్‍ని బట్టి కోతలు, కత్త్రిరింపులూను. ఆఖరికి పాటలు, హీరోయిన్ కూడా హీరోకి నచ్చాలి. ఇవన్నీ కాక కొంత మంది ఈ మధ్య దర్శకుడి పనుల్లో వేలు పెడుతున్నారంట. ఈ మధ్య వచ్చిన ఒక అగ్ర కధానాయకుడి రష్యన్ కమ్యూనిష్టు నాయకుడి పేరుతో వచ్చిన సినిమాకూ ఇదే గతి పట్టి, దర్శకుడు మధ్యలోనే పెట్టే, బేడా సర్దుకుని చెన్నయి చెక్కేసాడంట. తెలుగు సినిమా వజ్రపు హీన స్థాయికి వీరు చేసిన కృషి అనన్యం.
౦౩. హీరోయిన్లు : బజారు స్థాయికి దిగ జారారు. ఇది దర్శకుల అభిరుచికి పరాకాష్ట. ప్రేక్షకులు అలా కోరుకుంటున్నారనే వాడిని చెప్పుచ్చుకు కొట్టొచ్చు. వీరి పాత్రలకు కమెడియన్ కు ఉండే ప్రాధాన్యత కూడా ఉండదు. వస్తారు…హీరో వెనక పడతారు (కొన్ని సినిమాలలో అయినా విపరీతమైన కోరికలు, వికారమైన పాటలతో)…నాలుగు పాటలు….కట్ అయిపోయింది వీరి పాత్ర. తెర బయట కూడా వీరి జీవితాలు కుక్క జీవితం. సార్ అని ఎవరినైనా పిలవకపోతే ఇంటికే….నాకు తెలిసిన ఒక అసిస్టెంటు కెమరామన్ చెప్పిన ప్రకారం అయితే మనసున్న (ఆత్మాభిమానం) మనిషి ఎవరూ తెలుగు సినిమాలో హీరోయిన్ గా చెయ్యలేరు. అందుకే ఇందులో తెలుగు హీరోయిన్లు అతి కొద్దిగా ఉన్నారు.
౦౪. దర్శకులు : పాపం వీరి బాధలే వేరు. చాలా మంది దర్శకులు ఇప్పటికీ మంచి అభిరుచి ఉన్నవారే. కానీ వారిని దర్శకత్వం చెయ్యనిస్తే కదా? ఒక పేద్ద హిట్ కొడితే గానీ పెద్ద హీరోలు దగ్గరికి కూడా రానివ్వరు. ఒక్క శ్రీహరి మాత్రం ఈ విషయంలో చాలా మంచి వ్యక్తి అని విన్నాను. ఇప్పటి హీరోలకు ఉన్న పరాజయ భయాలకు ముఖ్యంగా బలవుతున్నది దర్శకులే. అందరూ రామ్ గోపాల్ వర్మలా చెయ్యలేరు కదా? వీరిలో కొంతమంది పళ్ళు, పువ్వులకు ప్రసిద్ధి, కొంతమంది కత్త్లులు, కటారులకు ప్రసిద్ధి. ఇలా రకరకాలుగా ఈ శాఖ అభివృద్ధి చెందింది. పాత దర్శకుల వరకూ ఎందుకూ, ఇప్పటి దాసరితో కూడా సరిపోలరు కొంతమంది.
౦౫. నిర్మాత : సొమ్మొకడిది, సోకొకడిది అనే సామెతకు అర్ధం పరమార్దం తెలుగు పరిశ్రమలో ఏ నిర్మాతనైనా అడగండి. ఆగకుండా అరగంట చెప్తాడు. సినిమా మొదలు పెట్టేదీ, చేతిలో కొంగు పట్టుకుని సిద్ధంగా ఉండేది వీరే అయినా, వీల్లకు సినిమామీద ఏమీ పట్టు ఉండదు. హీరో గారు గోదావరి వద్దు, మిసిసిపి ఒడ్డులో పాట ప్రెస్టేజియస్ తీద్దామంటే…ఓ అంతకన్నా భాగ్యమా అని టికెట్లకు డబ్బులు ఇవ్వటమే ఇప్పడు వీరి పని. చాలా కొద్ది మంది నిర్మాతలు మాత్రమే 'అభిరుచి' కలిగి ఉన్నారు.
౦౬. సంగీత దర్శకులు : గర్వ పడే స్థాయి నుంచి సంతోషపడే స్థాయికి వచ్చాం. ఇంకా దిగ జారలేదు. సంగీతానికి బాషతో సంబంధం లేదు కాబట్టి, తప్పని సరిగా ప్రతిభ ఉండాలి కాబట్టి మనం బ్రతికి పోయాం. బాధ పడాల్సినదేమిటంటే హోరు పెరిగింది, పాటలలో సాహిత్యం (ఉంటే) వినబడనివ్వటం లేదు. సాహిత్యాన్ని సంగీతం ఓడించడం అంటే ఇదే. అచ్చు పిల్లి (కాపీ క్యాట్) సంగీతం బాగా పెరిగింది. అదేదో మహా సంగీతం అన్నట్లు డాల్బీలు, డీటీయస్ లు, లండన్ లో రికార్డింగు. పెద్ద పెద్ద హాలీవుడ్ సినిమాలు కూడా అవసరం అయితేనే డీటీయస్ మిక్స్ చేస్తారు. మనకు మాత్రం అది డీఫాల్ట్.
౦౭. గాయక బృందం : మంచి నైపుణ్యం గలవారు ఉన్నారు. బాలు, జానకి, సుశీలలు ఇప్పటికీ మనం గర్వపడవలసిన గాయకులు. అయితే గాయక, గాయకీమణులు కూడా చిత్ర పరిశ్రమ వికృత పోకడలకు తలవంచి బూతు పాటలు పాడుతున్నారు. పాడనని మొండికేస్తే మొత్తం సినిమా పరిశ్రమ వారిని నిషేధించినా ఆశ్చర్యం అక్కరలేదు. వచ్చిన డబ్బు కూడా పోతుంది. జాతీయ అవార్డులు సాధిస్తారని ఆశలు పెట్టుకుంటే వీళ్ళ మీదే పెట్టుకోవాలి.
౦౮. ప్రతినాయకులు : పాత్రలకు కొద్దిగా న్యాయం చేస్తున్నది వీరే. కొన్ని సార్లు అనిపిస్తుంది…విలన్ పాత్రధారి ఆ పాత్రకు సరిపోయినట్లుగా హీరో సరిపోలేదు అని. ప్రకాష్‍రాజ్ వంటి ప్రతిభాశాలులు ఈ పాత్రలకు వన్నె తెచ్చారు. సత్యన్నారయణ, కోట వంటి వారు కొత్త ట్రెండుని సృష్టించారు. రావు గోపాలరావు గారి తర్వాత అంతమయి పోయిందనుకున్న ఈ శాఖ ప్రతిష్టను నిలబెట్టారు.
౦౯. హాస్య నటులు : ప్రతిభ అయితే పుష్కలం. కాకపోతే వీరిని చిత్ర దర్శకులు, మాటల రచయతలు జుగుప్సాకరంగా ఉపయోగించుకుంటున్నారు. వీరికి చిత్ర కధతో సంబంధం కూడా ఉండదు. ఈ మధ్యనే కొన్ని మంచి సినిమాలలో హాస్య నటులను బాగా ఉపయోగించుకున్నారు. ఉదాహరణకు మన్మధుడు, నువ్వు నాకు నచ్చావ్ వంటి చిత్రాలు.
10 comments:
కుండ బద్దలు కొట్టినట్లు చెప్పారుగా.బాగుంది.
మీరు frustration లో ఉన్నట్టున్నారు, కొన్నిటిని exaggerate చేసారు, కొన్నిటిని చాలా understate చేసారు.
mamci visleashana.
సరిగ్గా నా మనసులో వున్నమాటలే ఇవి. అబిరుచుగల నిర్మాతలకు ఇకనైనా మంచిరోజులు వస్తాయేమో చూడాలి.
చేతన గారు ఎవరు ఫ్రస్టేషన్ లో లేరు చెప్పండి. అయితే నేను ఇక్కడ exaggerate చేసినదయితే ఏమీ లేదు. ఉంటే తెలుపగలరు..understate అయితే చేసి ఉంటాను. ఎందుకంటే మన తెలుగు చిత్ర పరిశ్రమ గురించి ఎంత చెప్పినా తక్కువే :-) ఏమంటారు?
మీ అభిప్రాయాన్ని ఖండిద్దామనో, ఏకీభవించటంలేదనో, తప్పు అని prove చేద్దామనో కాదు.. కేవలం నా అభిప్రాయం మాత్రమే ఇది.
మీరు అంటున్న అగ్ర HEROES ఎంతమంది? 4? 5? 6? వాళ్ళు సంవత్సరానికి 2 సినిమాలు లెక్కన చేస్తే మొత్తం 10-12 సినిమాలు. so ఆ అగ్రకథానయకుల వల్ల, అగ్ర నాయకుల కోసం, అగ్రనాయకుల చేత మార్చబడుతున్న, సన్నివేసాలు, కథలు, లొకేషన్లు, etc etc వల్ల కంపు అవుతున్న సినిమాలు ఎన్ని 10-12? మిగతా సినిమాలకి ఎమొచ్చింది మాయరోగం. బద్దకం, మానసిక బద్దకం, మీరు అన్న smart work చేయటానికి, బుర్ర పెట్టి ఆలొచించటానికి, మంచి కథ ఉన్నా, చక్కని screenplay రాసుకోవటనికి. అవి ఉంటె, heroes అవసరం లెదు, Hi-tech stuff అవసరం లేదు. కథ మార్చమనే పెద్ద నిర్మాతలు అవసరం లేదు. Everybody wants easy fame. everybody wants success without having to work on necessary story and screenplay, and the things needed to tell the story in the best way possible. so they get a star, producer with lot of money, heroine in skimp clothes, loud music and gory fights all of which, they think, will ensure success. who suffers at the end? వాళ్ళే!! నాకు (లేక మీకు, లేక ప్రేక్షకుడు) ఏం పట్టే. సినిమా బాగుంటెనే చూస్తారు ప్రేక్షకులు. బాగుందని మనల్ని నమ్మించటానికి మళ్ళీ వాళ్ళు extra ఖర్చు పెట్టి ప్రెస్ మీట్లు, ఫంక్షన్లు, etc చేసుకోనీ. కోట్లు (వాళ్ళ డబ్బే) పెట్టి వజ్రోత్స్వాలు చేసుకోని.. తిట్టుకోనీ.. జనానికి కావాల్సింది entertainment, జనానికి కావాల్సింది నచ్చే సినిమా. అందరూ గోదావరి, బొమ్మరిల్లు అంటున్నరే గానీ, మిస్సమ్మ సినిమా, ఐతే సినిమా, అనుకోకుండా ఒక రోజు ఏమయ్యాయి? దాంట్లొ ఏమి స్టార్స్ ఉన్నారు? మనవాళ్ళు effort సరిగ్గ సరయిన దిశ లో చేయకుండా, hero మార్చమన్నాడు, నిర్మాత మార్చమన్నాడు, చెప్పిన విషయం జనాలకి ఎక్కలేదు (అబద్దం, నువ్వు సరీగా చెప్పటానికి ట్రయ్ కూడా చేయలెదు) అని వేళ్ళు అందరివైపు చూపిస్తే? (మిమ్మల్ని కాదు వాళ్ళని ఉద్ధేశ్యించి )
మీరు సరిగ్గ అక్కడే పప్పులో కాలేసారు. మన దౌర్భాగ్యం ఏమిటంటే ఈ 4, 5, 6 అగ్ర హీరోలే చిత్ర రంగ సంప్రదాయాన్ని, behavior ను 80% ప్రభావితం చేస్తున్నారు. ఎందుకంటె వారి market share దాదాపు 70%. మిగతా అందరిదీ 30%. ఆందువలన మిగతా సినిమాలకు ఏ మాయ రోగం లేకున్నా ఆడటానికి కనీసం థియేటర్లు దొరకాలిగా? "ఐతే" సినిమాకు థియేటర్లు దొరక్క మొదట్లో రెండు ప్రింట్లతో రిలీజ్ చేసారు.
వాళ్ళు అలా తీస్తే వాళ్లే suffer అవుతారనే దానిని నేను ఒప్పుకోను. ఈ పెద్ద హీరోలతో తీస్తే నిర్మాత హీరో అవుతాడు. బయ్యర్లు జీరోలవుతారు (ప్లాప్ లకు). అదీ మొదటి సూత్రం ఇప్పుడు పరిశ్రమలో..
ఇక చెప్పిన విషయం జనాలకు ఎక్కకపోవటం అనేది....ఇది ఎక్కడా జరగదు. మన ప్రేక్షకులు అంత మూర్ఖులు కాదు. కాకపోతే సినిమాలు మనకు పిచ్చి కాబట్టి టాక్ తో సంబంధం లేకుండా వెళ్ళిచూసే వారున్నారు. దానిని పట్టుకుని జనానికి నచ్చే సినిమా అనటం భావ్యమా? సినిమాలు అత్యంత శక్తివంతమైన మీడియా...అవి ఏమి చూపిస్తే అవే నిజమనుకునే అమాయకులు కోట్లు. అలానే ఉండాలనుకునే వాళ్ళు కోట్లు. అలాంటప్పుడు సినిమా తీసే వాడికి ఎంత బాధ్యత ఉండాలి. చూస్తున్నారు కదా అని కొత్త రోతలు పరిచయం చేస్తూ పోతారా? అది వారిష్టం, జనానికి నచ్చుతుంది కదా అంటే అంతకన్న బాధ్యాతా రాహిత్యం మరొకటి ఉండదు.
"వాళ్ళ డబ్బే పెట్టి చేసుకోనీ" : ఎవరి డబ్బు? తీసే బోడి కధలకు (మొత్తం కధను మూడుముక్కలలో చెప్పటానికి) పది, పన్నెండు కోట్లు పెట్టమని ప్రేక్షకుడు అడిగాడా? లేదే? ఆడియో హక్కులే మూడు కోట్లకు అమ్ముకోమని అడిగాడా? లేదే. మహా అయితే సినిమా టికెట్ట్కు రేటు తగ్గితే బాగుండుననుకుంటాడు. అవి పెరగటానికి కారణం మీరంటున్న చిన్న చిన్న సినిమాలు కావు. ఈ అగ్ర హీరోల సినిమా ఖర్చులు ఒక శృంఖల చర్యలా వాటిని పెంచాయి. అందుకే ప్లాప్ సినిమాలు కూడా భారీగా బయ్యర్ల నుంచి డబ్బులు రాబట్టుకుంటున్నాయి. సినిమా బాగుంటేనే చూస్తారు ప్రేక్షకులు. నేను చెప్పేది కూడా అదే. కానీ అది సినిమా తీసే వాళ్లకు అర్ధం అవ్వాలి కదా?
మీరు చెప్పింది నిజమయినా నేననుకోవడం సినిమాను ప్రభావితం చేసే వాళ్లలో అగ్రతాంబూలం తెలుగు ప్రేక్షకులదే.ఎందుకంటారా? బ్లాక్ బస్టర్ హిట్స్ గా మనం చెప్పుకొనే సినిమాలేవి?- ఓ వేటగాడు, ఓ అడవిరాముడు, ఓ ఘరానా మొగుడు, ఓ సమరసింహారెడ్డి,ఓ ఇంద్ర, ఓ సింహాద్రి, ఓ పోకిరి...ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో! వీటన్నిటిలో మీరు చెప్పిన అవలక్షణాలన్నీ ఉన్నాయి.కానీ ఇవన్నీ మెగా హిట్లు!
ఇక్కడ మనం గమనించాల్సింది, తెలుగు సినీ సమీక్షకులంతా మరచింది ఒకటుంది.తెలుగు సినిమాకు మహారాజపోషకులంతా 'మాస్' అనబడే వర్గం.ఇందులో పల్లెటూర్లలో, పట్నాల్లో ఉండే అల్పాదాయ వర్గాలు, కొండకచో నిరక్షరాస్యులు, ఆటోవాలాలు, మసాలాదినుసులకు అలవాటు పడ్డ ప్రాణాలు మొ.వారు.
వీళ్లకున్న ఒకేఒక ఆటవిడుపు సినిమా.వీరిని కాదని సినిమా తీసే ప్రయత్నం ఏ నిర్మాత చేయజాలడు.అప్పుడప్పుడు చేసే సాహసాలు కాకుండా! ఓ తెలుగు బ్లాగరి అన్నట్టు 'యథాప్రేక్షక తథాతెలుగుసినిమా'!
ఇస్మాయిల్ గారూ నా మనసులోని మాటని మీరు వెలిబుచ్చారు. ఇకపోతే మంచి సినెమా తీస్తే జనం ఎందుకు చూడరు అని అంటున్నారు.. దానికి మన తెలుగులో ఎన్నో ఉదాహరణలు ఉన్నయి... ఈ మధ్య వచ్చిన వాటిలో నాకు తెలిసి గ్రహణం.... భారం మొత్తం అగ్ర హీరోల మీద వెయ్యడం భావ్యం కాదు.
"యధాప్రేక్షక తధా తెలుగు సినిమా..."
ఇది కేవలం అపోహ. ప్రెక్షకులు తమకి ఫలానా తరహా సినిమాలే కావాలని ఎప్పుడూ చెప్పలేదు. నేను చెప్పేది ఒక్కటే...ఒక ఇంద్ర వెనక ఎన్ని "అందరివాడు"లు ఉన్నాయ్? ఒక సమరసింహా రెడ్డి వెనుక ఎన్ని విజయేంద్ర వర్మలున్నాయ్?
ఇంద్ర, సమరసింహారెడ్డి లు ఎందుకు విజయవంతమయ్యయో అసలు కారణం పట్టించుకోక కేవలం మూసపోకడలు పోవడం వెర్రితనం.
నా బ్లాగులో రాసిందే ఇక్కడ మళ్ళీ అంటున్నాను. ఎంత శాతం మంచి సినిమాలు నష్టపోయాయి? ఎంత శాతం చెత్త సినిమాలు విజయం పొందాయి? ఇది పరిశీలిస్తే ఎవరికైనా అర్ధమౌతుంది.
మంచి సినిమా అనగానే పథేర్ పాంచాలి లాంటి ఆర్టు సినిమా మాత్రామేనని చదువుకోకూడదని మనవి.
ఇంకొక్క విషయం ఏమిటంటే, మన so called అగ్ర హీరోల మధ్య పోటీ మూలంగా నిర్మాత నష్టపోతున్నడన్నది నిర్ద్వందంగా ఒప్పుకోవలసిన సత్యం.
Post a Comment