Friday, September 28, 2007

హాలో మూడు...ఆటల ప్రపంచంలో అమ్మకాల రికార్డులు బద్దలు

ఈ అమెరికోల్లకి కంప్యూటర్ ఆటల పిచ్చి కొద్దిగ ఎక్కువ అని తెలుసు గానీ, ఇంత ఎక్కువని తెలీదు. XBOX 360 కోసం తయారయిన Halo 3 ఆట విడుడలయిన ఇరవై నాలుగ్గంటలలో 170 మిలియన్ల డాలర్లు అమ్మకాలు జరిగి, కంప్యూటర్ ఆటల రంగంలో కొత్త రికార్డు సృష్టించింది.

అంతే కాక అదే రోజు ఇంకో రెండు రికార్డులు...అత్యధిక ముందస్తు అమ్మకాలు, అత్యధిక అంతర్జాల ఆటగాళ్ళు ఆడిన ఆటగా రికార్డులకెక్కింది.

ఇక్కడ మీరు కధనం చదవవచ్చు.

ప్రతిష్టాత్మక MIT విశ్వవిద్యాలయం విద్యార్ధులు Halo 3 విడుదల సందర్భంగా ఏర్పాటు చేసిన ఒక సరదా విగ్రహం

Thursday, September 27, 2007

సెప్టెంబరు నెలలో పదివేల దర్శనాలు

ఈ సంవత్సరం తెలుగు బ్లాగులను సందర్శించేవారి సంఖ్య గణనీయంగా పెరిగింది. ఈ సెప్టెంబరు నెలలోనే నా బ్లాగు దర్శనాల సంఖ్య పది వేలు దాటేసింది. వావ్...

Tuesday, September 25, 2007

ప్రపంచ ఇరవై-ఇరవై : మరిచిపోలేని మధుర క్షణాలు

ఇండియా, పాక్ ని ప్రపంచ వరల్డ్ కప్ మొదటి బౌల్ - ఔట్ లో ఓడించిన మధుర క్షణాలు



యువరాజ్ సింగు వరుసగా ఆరు బంతులకు ఆరు ఆర్లు బాదిన మధుర క్షణాలు (విలువ : కోటి రూపాయల బహుమతి)




ఫైనల్ పోటీలో మిస్బా ఉల్ హక్ కు జోగిందర్ వేసిన చివరి మూడు బంతులు

Monday, September 17, 2007

సమాల్‍ చేసింది తప్పా ఒప్పా?

దేశంలో తొలి సారిగా ప్రభుత్వం పైన సంచలన వ్యాఖ్యలు చేసి పెద్ద తేనె తుట్టెనే రేపారు. ప్రభుత్వ రంగంలో అంతులేని అవినీతి వున్నదనేది ఎవరూ కాదనలేని నిజం. అంతే కాదు ఈ అవినీతికి కొమ్ము కాసే వారు సాక్షాత్తు రాజకీయ నాయకులేననీ అందరికీ తెలుసు. చిన్న చిన్న విషయాలలో కూడా తల దూర్చి కాంట్రాక్టుల కమీషన్లు కొట్టడం మన ఎమ్.ఎల్.యే లకు అలవాటే. దీనిలో అన్ని పార్టీలతో సహా ఎవరికి మినహాయింపు లేదు. ఒకరికి ఒకరు సాటి.



అయితే ఇప్పుడు సమాల్ ఆరోపణలు విషయానికొస్తే...నాకు వచ్చిన ఆలోచనలు ఇవి..




  • అధికారంలో వుండగా అసలు అందరినీ వణుకు పుట్టించేలా రిపోర్టులు ఇవ్వొచ్చు..ఎందుకు చెయ్యలేదు ?


  • విజిలెన్సు రిపోర్టును అసెంబ్లీకి సమర్పిస్తారు. సమర్పించవచ్చు కదా?


  • ఇన్ని అన్యాయాలు జరుగుతుంటే ఏ.సీ.బికి గానీ, ముఖ్యమంత్రికి గానీ రహస్య నివేదిక సమర్పించవచ్చు కదా?


  • ప్రభుత్వ విజిలెన్సు డాటా ను రిటైర్మెంటు తర్వాత పత్రికలకు ఇవ్వటం ఎంతవరకూ సమంజసం?


  • మూడు సంవత్సరాలుగా విజిలెన్సు నివేదికలు ఇవ్వకపోతే, ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోలేదు?


  • హఠాత్తుగా ఇప్పుడు సమాల్ మీద అసభ్యంగా వ్యాఖ్యలు చేస్తున్న వారు ఇప్పటి వరకు ఎందుకు ఊరుకున్నారు?


  • కుల ప్రసక్తితో సమాల్ మీద ఎదురు దాడికి దిగటం అంత అవసరమా? లేదా ఇంకో దారి దొరకక ఈ వ్యాఖ్యలకు తెగబడుతున్నారా?


  • ప్రతిపక్షాలు తెగ అల్లరి చేస్తున్నాయి ఇప్పుడు...గానీ వారు పక్షంలో జరిగిన వాటి మీద ఎప్పుడయినా చర్యలు తీసుకున్నారా? ఈ మూడేళ్ల లోనే హఠాత్తుగా అవినీతి కొండంతగా పెరిగిందా?


  • సమాల్ బయట పెట్టిన విషయాలు ప్రతి పక్షాలకు ఇప్పటి వరకూ తెలియదా? వాటికి ఆ మాత్రం లాబీయింగ్ నెట్వర్కు ప్రభుత్వంలో లేదా?



ఏది ఏమైనా అందరూ కలసి సామాన్యుడి జీవితాన్ని, ప్రభుత్వ యంత్రాంగాన్ని అపహాస్యం చేస్తున్నారనేది నిర్వివాదాంశం. అది కాంగ్రెస్ అయినా, తెలుగు దేశం అయినా, సీపియమ్ లేదా భాజపా అయినా పెద్దగా తేడా లేదు. మనుషులే మారతారు. ఈ ఐ.ఏ.యస్ లు, ఐ.పీ.యస్ లు, రాజకీయ నాయకుల పంచన చేరి వారికి కుక్క సేవ చెయ్యకా మానరు. మన విస్తరిని చించకా మానరు.

Saturday, September 15, 2007

శోధనను కాలచక్రంలో ప్రతిశోధిస్తే...

ఈ రోజు ఈనాడులో తెలుగు బ్లాగుల మీద వ్యాసం వచ్చింది. చాలా సంతోషం. కొత్తగా వచ్చే వాళ్లకు నీ బ్లాగులో టపాలు ఎక్కువ కనిపించవు కదరా...ఎలా చదువుతారు అనడిగాడు మా ఫ్రెండొకడు. అందుకని గత రెండు సంవత్సరాల నుంచి రాసిన 200 పైగా వున్న టపాల నుంచి కొన్ని (బాగా హిట్లు వచ్చినవి, ఆదరణ పొందినవి) ఇక్కడ పెడుతున్నా...(పాతవి ముందర)

రాజధాని సిత్రాలు

భీముడు, బకాసురుడు...తెలుగు పరీక్ష

ఎవరు నేర్పారమ్మ ఈ పల్లెకూ?

అయ్యా అధ్యక్షా

మన సినిమా హాస్యం నిజంగా హాస్యమేనా

నీ కోసం ఎదురు చూసే వారెవరు?


హాయ్ నా పేరు గణపతి...౧
హాయ్ నా పేరు గణపతి...౨


హిందూ ఎక్కడి నుంచి పుట్టింది?

అంతా మన మంచికే

మరో పద్మ వ్యూహమా

బాబోయ్ TV9

నేను నష్ట పోయాన్రా బాబు

పిచ్చి భారతం

పావుకిలో పేరు మార్చాలి

మెగా ఆ(టో)గడాలు

తెలుగు సినిమా వజ్రోత్సవాలు,,,హీరోలు...జీరోలు - ౧
తెలుగు సినిమా వజ్రోత్సవాలు,,,హీరోలు...జీరోలు - ౨

అందమైన జీవితమా? అందమైన సెల్ ఫోనా


దేశ ముదురు (A)

ఇది నవ్వే విషయమా?

సీమాస్ పై (సీ)లిపి సాహసం

క్రికెటాభిమానులు...జర భద్రం

భారతీయులు, క్రీడా స్ఫూర్తి

ప్రాణ సంకట బాదు

పిల్లికి చెలగాటం...ఎలుకకి ప్రాణ సంకటం

నేనూ ఒక కవినే...

రామా? సేతువు కట్టావా లేదా?

గుర్తుకొస్తున్నాయి...గుర్తుకొస్తున్నాయి

తానా తందానా

ఎంతకాలం ఈ ఆత్మద్రోహం

నీకా ఛాన్స్ ఇవ్వను

సాఫ్ట్వేర్ రంగంలో బుర్రలు ఎంత వేడెక్కి జుత్తు రాలి బట్ట తలలు వచ్చేసినా, ప్రతీ పనిలోను వెతుక్కుంటే కుప్పలుగా వినోదం దొరుకుతుంది. కంగారులో, ఆతృతలో బయటపడే వినోదమన్నమాట. ఎలాంటి సంఘటనలు మళ్ళీ మళ్ళీ చెప్పుకుని పగలబడి నవ్వుకుంటాం. అలాంటిది ఒకటి... నేను ఎప్పుడూ మర్చిపోలేనిది ఇది...

అవి నా కెరీర్ మొదటి సంవత్సరపు రోజులు. ఒక చిన్న కొత్త కంపనీలో ఉద్యోగం. అది కూడా మా ఫ్రెండు గాడి ఎన్నారై చుట్టాలది, అందువలన మేమే దానికి ఆద్య్లులం, ఆర్యులం కూడా. మా ఎనిమిది మంది స్నేహితులు అక్కడే పని చేసేవాళ్లం. అప్పుడే యూనివర్సిటీ నుంచి బయటకు వచ్చామో ఏమో, బాగా ఏపుగా పెరిగిన తోటకూర పొలంలోనికి బర్రెను తోలి..ఇక నీ ఇష్టం, తిను పో అన్నట్లుగా వుండేది మా పరిస్థితి. ఏది దొరికితే అది చదివెయ్యటం, ఇంటర్నెట్ను పీల్చి పిప్పి చెయ్యటం, రోజులు పద్దెనిమిది గంటలు పని చెయ్యటం అలవాటయిపోయాయి. కంపనీ నుంచి ప్రోత్సాహం అలానే వుండేది మరి. మేమందరం కలసి విబి, ఒరాకిల్ కాంబినేషన్ లో ఒక కంటెంట్ పోర్టల్ నడుపే సాఫ్ట్ వేర్ రాస్తుండే వాళ్లం. చాలా పెద్ద ప్రాజెక్టు అది. అందులో డాటా కూడా చాలా ముఖ్యమైనది.

ఒక రోజు నా స్నేహితుడు, ఆ సిస్టంలో వున్న పనికిరాని డాటాని తీసేసే ప్రోగ్రామ్ చాలా దీక్షగా రాస్తున్నాడు. సాధారణంగా ఎవరూ డాటాని తొలగించరు, దానిని ఇంకొక చోటకు తరలించెయ్యటమో, ఫ్లాగ్ చెయ్యటమో చేస్తారు. అది మాకు ఆ రోజులలో తెలియదు. వాడు ప్రోగ్రామ్ రాసేసాడు. మా ఇంకొక ఫ్రెండుని పెల్చి ఒరే ...ఇక నువ్వు టెస్టు చేసుకో..ఇటీజ్ డన్...యూనో అని రిలాక్స్ అయ్యాడు. వాడొచ్చి అప్లికేషన్ మొదలుపెట్టి, పనికి రాని డాటా అంతా వెతికి అంతా సెలెక్టు చేసుకుని "Delete Selected Data" అనే బటన్ నొక్కాడు. అప్పుడు వాడికి ఈ విధంగా స్క్రీన్ మీద కనిపించింది.(నేను దానిని మరలా తయారు చేసి పెట్టాను ఇక్కడ)



ఇది చూసాక టెస్ట్ చేస్తున్న మా ఫ్రెండు గాడికి డాటా బ్యాకప్ తీసుకుంటే మంచిదేమో అన్న ఆలోచన వచ్చింది.వాడు..కానీ అక్కడా "Cancel" బటన్ వుంటేగా? ఒకే ఒక్క ఆప్షన్.వెనుతిరిగే ఛాన్సే లేదు :-) వాడు వెనక్కు తిరిగి అయోమయంగా, అదో రకంగా మా వాడి వైపు నవ్వాలా, ఏడాలా అన్నట్లు చూసాడు. వాడిదీ అదే పరిస్థితి. కంగారులో "Cancel" పెట్టలేదు వాడు. అయితే ఇంకేం చేస్తాం...ఇక్కడ "Ok" బటన్ నొక్కకుండా వదిలేసి, డాటా సర్వర్ మీద నుంచి కాపీ చేస్తా ఒక్క నిముషంలో అని పరిగెత్తాడు. గబ గబా క్వెరీలు అవీ రాసి ఆ డాటా వెతకటం మొదలు పెట్టాడు. ఎంతకూ దొరకదే...

తీరా అనుమానం వచ్చి ఆ అప్లికేషన్ కోడ్ చూస్తే...

డాటా అంతా చెరిపేసాకే మా వాడు ఆ సందేశం ("Are you sure..") చూపిస్తున్నాడు. అదీ ఒక్క బటన్ తో...

ఇక ఆ రోజంతా కడుపు నొప్పొచ్చేలా నవ్వుకున్నాం...ఆ సంఘటన గుర్తుకొచ్చినప్పుడల్లా నవ్వొస్తూనే వుంటుంది.

Tuesday, September 11, 2007

ఐ టీ ఉద్యోగుల ఆగష్టు నెల బాధలు

ఆగష్టు, సెప్టెంబరు నెలలు సమీపించే కొద్ది సాఫ్టువేరు ఇంజనీర్ల పనితనం ఒక్క సారిగా పెరిగిపోతుంది. ఎందుకంటే ఆ నెలలలోనే తమ పనితనం తాలుకా మూల్యాంకనం జరిగి కొత్త జీతాలు నిర్ణయిస్తారు కాబట్టి. ఎవడి వైపు చూసినా చాలా ప్రో యాక్టివ్ గా పని చేసేస్తుంటారు. వార్నీ..ఈడి పొట్టలో అణు రియాక్టరు వుందా అని అనుమానాలు వస్తాయి వాళ్ల వైపు చూస్తే...ఇంతా చేస్తే అసలు పిలకంతా మేనేజరు చేతిలోనే వుంటుంది. మేనేజరును రకరకాల కోతి వేషాలు వేసి, సోపు రాసి ఆనందింపచెయ్యటం కొంతమంది చెయ్యగలుగుతారు. ఆ చేష్టలు ఈ టైములో ఎక్కువవుతాయన్నమాట. శుభ్రంగా బాగా పని చేసుకునే వాళ్లు మాత్రం అమాయకంగా ఎదురుచూస్తూ వుంటారు...నా మేనేజరు ఈ సారి ఏ కహాని చెప్తాడా అని. ఈ బాధలపై నితిన్ శ్రీ వాస్తవ్ అనే మన బోటి సాఫ్టు వేర్ నిపుణుడు గీసిన కార్టూన్ చూడండి. కడుపుబ్బా నవ్వుకోండి.










Sunday, September 09, 2007

ఇది ఒక తగలబడుతున్న రోమ్

ఇదేనా భాగ్యనగరం అనుకుని పదిహేను రోజులయ్యిందేమో...మరికొంత మంది అభాగ్యులు కన్ను తెరిచేలోపు ప్రాణాలు వదిలేసారు. ఎప్పటిలానే మన ఎక్స్ గ్రేషియా రాజకీయం రంగప్రవేశం చేసింది. ప్రతి రాజకీయ నాయకుడు పరిగెత్తుకొచ్చేసి ఐదు లక్షలు ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని నిర్ణయించేసారు..ఎంత దయార్ద హృదయులు? వారికి చెందిన పార్టీల కార్యకర్తలు ఒక్కడొస్తే ఒట్టు. ఒక్క నాయకుడైనా తమ పార్టీ తరపున ఒక్క లక్ష ఎక్స్ గ్రేషియా ప్ర్రకటిస్తారేమో అని చూసా? ఛ ఛ అంత పని మన వాళ్లు చెయ్యటమా? నాయకుల సభలకు బ్యానర్లకు పెడతారు కోట్లు..మరి ఇక్కడ ఏం అడ్డు వస్తుందో వీళ్లకు?


మొత్తానికి ఒకటి అర్ధం అయ్యింది. మనకు ప్రత్యేకంగా ఎక్స్ గ్రేషియా మంత్రిత్వ శాఖ వుండాల్సిందే. ప్రతి నెలా క్రమం తప్పకుండా చనిపోతున్న రైతులు, అభాగ్యులు, పోలిస్ బాధితులు మొదలైన వారికి సక్రమంగా ఈ డబ్బులు అందచెయ్యటం అప్పుడు సులభం అవుతుంది.


మొన్నామధ్య ఈ నగరానికి ఏ.వన్ హోదా ఇచ్చినపుడు నాకు తిక్క రేగింది. అసలు ఏ.వన్ హోదా ఎందుకు, ఏ నగరానికి ఇస్తారో నాకు తెలియదు కానీ, మామూలు స్థాయి నుంచి అతి దరిద్ర స్థాయికి చేరుకున్న నగరాలకు ఇవ్వరని మాత్రం నాకు గట్టి నమ్మకం వుండేది. ఆ నమ్మకం ఆ రోజుతో పోయింది.



ఇక్కడ వర్షం పడితే ఒకరిద్దరు చనిపోతారు...మాన్ హోల్లలో పడి. దీనిని ఎవడూ బాగు చెయ్యలేడు. చేతులెత్తేసారు.



ఇక్కడ తీవ్ర వాదులు హాయిగా పాస్ పోర్టులు, రేషన్ కార్డులు తీసుకోవటానికి వస్తారు. ఇక్కడే సురక్షితంగా మకాం చేస్తారు.



ఇక్కడ చినుకు పడితే ట్రాఫిక్ నరకం. పోలీసులు మాత్రం మాయం



చలానాలతోనే సంవత్సరానికి కోటి రూపాయల ఆదాయం సంపాదిస్తారు ఇక్కడి పోలీసులు.



ఇక్కడ రోజుకు మద్యం విక్రయం ఒకటిన్నర కోటి.



ఎక్కడ బాంబుకు పేల్తాయో తెలియదు. ఎవరు పేల్చారో ప్రభుత్వానికి అంతకన్నా తెలియదు.



నాసి రకం రోడ్లు, స్కూల్లు, పార్కింగులు కూడా లేని షాపింగు మాల్లు..




ఇంకా చెప్పాలంటే ఇది ఒక భూలోక అవినీతి నరకంగా తయారయింది.


ఇది ఒక తగలబడుతున్న రోమ్




దేవుడా మా నీరో శేఖరుడికి కాస్త మెదడును, ప్రజలను పాలించే ప్రజ్ఞను ప్రసాదించు తండ్రీ..



రవీంద్రుని మాటలలో..



ఎక్కడ ప్రభుత్వం ప్రజలను తన వాళ్ళనుకుంటుందో



ఎక్కడ అవినీతి అడ్రస్ లేకుండా పోతుందో



ఎక్కడ అధికారులు, తమ పదవులను సేవాతత్పరతతో నిర్వహిస్తారో



ఎక్కడ ప్రజలు తాము సురక్షిత సమాజంలో వున్నామని భావిస్తారో



అక్కడా నా దేశాన్ని మేల్కొలుపు తండ్రీ

Sunday, September 02, 2007

ఇది అన్యాయం ..చాలా అన్యాయం :-(

ఇది అన్యాయం. చాలా అన్యాయంగా అంకితా మిశ్రా ని సోనీ ఇండియన్ ఇడోల్ పోటీల నుంచి మరొకసారి బయటకు పంపేసారు. నా అభిమాన గాయకుడు అమిత్ పాల్. అయినా ప్రస్తుతం మిగిలిన నలుగురు పోటీదారులు (అమిత్ పాల్, ప్రశాంత్, ఈమన్ ఛటర్జీ, అంకిత) లో అంకితా ఒక విలక్షణమైన గాయని. పాటొక్కటే కాదు, హావభావాలు, స్పోర్టివ్‍నెస్ లలో అంకితాకు సాటి ఎవ్వరూ లేరు. ఈ చెత్త నిర్ణయానికి sms లు తమ వంతు కృషి చేసాయి. ఎలాంటి పాటనైనా పవర్ హౌజ్ గొంతుతో అద్భుతంగా పాడటం అంకితకే సొంతం. అలాంటి మంచి గాయనిని ఇండియన్ ఐడోల్ కార్యక్రమం కోల్పోయింది అని చెప్పక తప్పదు. నాకైతే ప్రశాంత్ ని ఇంటికి ఎప్పుడు పంపుతారా ఎప్పుడూ అనిపిస్తుంది.

ఏది ఏమైనా నాకు చాలా బాధగా వుంది. ఈ లెక్కన అమిత్ పాల్ ని కూడా పంపేస్తారేమో :-(

Friday, August 31, 2007

ఎంతకాలం ఈ ఆత్మ ద్రోహం ?

పని వత్తిడి వలన ఇంతకాలం కొన్ని టపాలు చదవలేకపోయాను. అందులో ఈ మంచి టపా ఒకటి. చదివితే కొంతమంది బాధపడినా, అది నిప్పులాంటి నిజాన్ని ఒప్పుకోమని చెప్పగలిగిందనేది వాస్తవం. అవన్నీ చూసి, నిష్టూరాలు వేసే ముందు మొదట భారతదేశ సమీకరణాన్ని చూద్దాం, చరిత్ర చూద్దాం...ఎందుకు, ఏమిటి, ఎలా అనే మూడు చదువుదాం.

(CIA Fact Book, July 2007 లెక్కల ప్రకారం)

భారత దేశ ప్రస్తుత జనాభా : 1,129,866,154

మతాల పరంగా చూస్తే

హిందువులు : 80.5%

ముస్లిములు : 13.4%

క్రిష్టియన్లు : 2.3%

సిక్కులు : 1.9%

మిగిలిన వారు : 1.8%

అయితే భారతదేశం రాజ్యాంగపరంగా ఈ శాతాలను వేటినీ పరిపాలనా సిద్ధాంతాలకు ప్రాతిపదికగా తీసుకోజాలదు. మనది ప్రజాస్వామ్య లౌకిక సార్వభౌమ దేశం కాబట్టి. పాకిస్తాన్, బంగ్లాదేశాలలో ఈ శాతాలు మొత్తం ప్రభుత్వాలనే మత ప్రాతిపదికగా ఏర్పరిచాయి. ఆ దేశాలలో మైనారిటీల గోల వేరు. బాధలు వేరు. వారిని ఎవరూ పట్టించుకోరు. ఒక పట్టించుకుని ఎవరన్నా చిన్న పుస్తకం రాస్తే దేవుడి పేర తల తీసెయ్యమని ఒక ఫత్వా ప్రపంచవ్యాప్తంగా జారీ అయుపోతుంది. ప్రపంచవ్యాప్తంగా ఎవడో ఒకడు దానిని అమలు చేసెస్తాడు.

ఇక మన దేశంలో....మైనారిటి చట్టాలు ఎలా వుంటాయంటే, వారిని భారతదేశ పౌరులమేనా మనం అనే రకంగా భావించుకునేటట్లుగా నిర్ణయింపబడ్డాయి. వారి చట్టాలు వేరు, నిధులు వేరు, ఎండోమెంటు పనులు వేరు, స్త్రీల చట్టాలు వేరు, స్కూళ్ళు వేరు, ఆఖరికి కాలేజీలు కూడా వేరే. మన దేశంలో ఇంకా ఫత్వా అనేదానికి అర్ధం వుంది. అది ఒక ఇమామ్ జారీ చేసాడు కూడా. అదే ఫత్వాలో సగం తీవ్రతతో ఒక వాఖ్య ఏదైనా ఎవడైనా ఒంకొకడు చేస్తే పార్లమెంటు దుమ్మెత్తిపోతుంది. పార్టీలు పోటీలు పడి మైనారిటీ ప్రేమను చూపిస్తాయి. ఆ అన్నవాడికి మతతత్వాన్ని అంటగట్టేస్తాయి. ఈ డ్రామా చాలా రోజులనుంచి ఇలానే జరుగుతుంది. 

అలా అని ఈ దేశంలో హిందువులేమి తక్కువ కాదు. వారిలోనూ అతివాదులున్నారు. వెధవ పనులూ చేసారు, ప్రాణాలూ తీసారు. కానీ దేశంలో ఎంత మంది వారికి చేయూతనిస్తున్నారు? వారి  నెట్వర్క్ ఏమిటి? మహా అయితే ఒకటి రెండు రాజకీయ పార్టీలు. అవి కూడా దేశ రాజ్యాంగానికి లోబడినవి. వీరి నుంచి అన్య మతాలకు కొద్దిగా ఇరకాటాలుంటాయి, కానీ దేశానికి చిచ్చు మాత్రం పెట్టరు. అంటే పార్లమెంటు మీద దాడి చెయ్యటం లాంటివన్న మాట.

ఇక మిగిలిన శాతం చూద్దాం. 13.4% శాతంలో మహా అయితే 1.0 % శాతం మాత్రమే అతివాదులుంటారు. కానీ ఈ ఒక్క శాతం ఎంత ప్రమాదకరంగా మారుతుందో అందరికి తెలిసిందే. దానిని ఎవడూ ఒప్పుకోడు. ఒప్పుకుంటే వోట్లు రాలవన్న భయం. అసలు నాకర్ధం కానిది, "అఫ్జల్" గాడిని వురి తీస్తే మన దేశంలో ముస్లింలు ఎందుకు ఓట్లు వెయ్యరు? అలా అని రాజకీయపార్టీలు ఎందుకనుకుంటున్నాయి? ఆ లెక్కన మన దేశంలో ముస్లింలు దేశభక్తి ఏమన్నా లేని వారా? అద్భుత కళాకారులు, రాజ్యాంగ నిపుణులు, వైద్యులు అన్ని రంగాలలో స్రష్టలు వున్నారు కదా? మరి ఎక్కడుందీ సమస్య? ఎవరు ఈ ఇమేజ్ ను మన దేశపు ముస్లిములకు అంటగడుతున్నారు? ఎందుకు ఇస్లామిక్ తీవ్రవాదానికి మన దేశంలో చేయూత లభిస్తుంది?

బహుశా ఇవి కొన్ని కారణాలు కావచ్చు...

౦౧. ప్రభుత్వాలు, మదరస్సాలు వారిలో అవిద్యను పెంచి పోషించటం
౦౨. ప్రభుత్వపు సవతి తల్లి ప్రేమ
౦౩. అధిక స్థాయిలో పేదరికం
౦౪. పాత తరపు చాందస వాద ఇస్లామిక్ పార్టీల పట్టు

పైన పేర్కొన్న నాలుగు కారణాలు ఇస్లామిస్ తీవ్ర వాదులకు మన దేశం, ముఖ్యంగా హైదరాబాదు లాంటి నగరాలు పెట్టని కోటగా మారుస్తున్నాయి. హైదరాబాద్ లో ఇప్పటికి పాత నగరం కానీ, ఇతర ప్రాంతాలలో చిన్న రోడ్డు ప్రమాదం జరిగితే, ఆ చేసిన వాడు పారిపోవాలి, లేక పోతే వాడిని నడి రోడ్డులో చంపేసినా చంపేస్తారు. వాహనాలు తగలబెడతారు. ఈ కార్యక్రమంలో సాక్షాత్తు ఆ ప్రాంతపు ఎమ్మెల్యేనో, ఎంపీనో పాల్గొంటారు. భాగ్యనగరంలో అయితే పాత తరపు రజాకర్ల పార్టీలు ఇంకా ఆ ప్రాంతాలను ఏలుతున్నాయి. ఒక అభివృద్ది వుండదు. అసెంబ్లీలో వారినుంచి ఒక్క ప్రశ్న వుండదు. ఎవరూ ఏ తనిఖీకి పాతనగరం వెళ్ళలేరు. వెళ్తే వస్తారో రారో చెప్పలేం. ఇలా వుంది పరిస్థితి. దీనిని సరి చెయ్యటానికి ఏ పెద్ద పార్టీ కూడా ప్రయత్నించదు. ఎందుకంటే మైనారిటీలు రాజకీయపరంగా చైతన్యం పొందితే వారికి చాలా ప్రమాదం. ప్రస్తుతానికి వారికి కావలిసింది మాస్ వోటింగు సరళి. అంటే ఏదో ఒక తెగ నాయకుడిని మంచి చేసుకుంతే, ఆ తెగ అందరూ ఆ పెద్ద చెప్పినట్లు వోట్ వెయ్యటం లాంటిదన్నమాట. ఆ రకంగానే మైనారిటీ వోట్లు ఈ రాజకీయ పార్టీలకు కావాలి. అంతే కానీ వారి అభివృద్ధి గానీ, విద్య గానీ అస్సలు పట్టదు.

పైన చెప్పిన జాడ్యాలన్ని తీవ్రవాద పార్టీలకు అచ్చంగా మన ప్రభుత్వం ఇచ్చిన వరాలు. ప్రస్తుతం పరిస్థితి ఎలా వుందంటే ఒక తీవ్రవాది దొరికితే వాడికి శిక్ష కూడా వోట్ల రాజకీయాల బట్టి అమలు చేస్తున్నారు.

ఈ మతం మత్తునుంచి దేశం ఎప్పుడు బయట పడుతుంది? తీవ్రవాది, దేశ ద్రోహి అన్నాక ఏ మతమైనా ఒకటే. మతాన్ని దానికి జోడించి ప్రకటనలు ఎందుకు చేస్తారో అర్ధం కాదు. ఇది ఇలానే జరిగుతూ పోతే మైనారిటీలు, ముఖ్యంగా ముస్లింలు దేశ భావ స్రవంతి నుంచి క్రమంగా దూరమైపోతారు. తమ దేశంలోనే పరాయిగా బతుకుతారు.

ఎంతకాలం ఇలా మనం స్వీయమోసం చేసుకుంటాం? ఒక జాతి, ఒక జాతి అని లక్ష సార్లు అరిచేకంటే, ఒక్క జాతిగా బతికి చూపితే మంచిదేమో?  

Thursday, August 30, 2007

కంప్యూటర్ ఎరా తెలుగు వెలుగులు...

కంప్యూటర్ ఎరా తెలుగు సాంకేతిక పత్రిక "వెబ్ లో తెలుగు వెలుగులు" పతాక శీర్షికతో ఇప్పుడు లభ్యం. అన్ని విషయాలను (ఏదీ వదల లేదేమో బహుశా) అంత నేర్పుగా కూరి కూరి అద్భుతంగా వండి పడేసిన ఘనత మాత్రం జ్యోతి గారిదే. అన్ని పేజీలకు తమ అమూల్యమైన పత్రిక పుటలను కేటాయించిన పెద్ద మనసు మన నల్లమోతు శ్రీధర్ గారిదే...వారిద్దరికి మనసారా ధన్యవాదాలు. నిన్న రాత్రి నేను నా ప్రతి కొనుక్కున్నా...పదిహేను రూపాయలలో మీకు పది రోజులకు సరిపడా చదువుకునేందుకు అందులో విషయాలు వున్నాయి. మరెందుకిక ఆలస్యం...మీ ప్రతి కొనుక్కునేందుకు బయల్దేరండి. లేదా సంవత్సర చందాదారులుగా చేరండి. మన అమ్మా నాన్నలకు కంప్యూటర్ నేర్పాలంటే ఇంతకంటే మంచి పుస్తకం దొరకదు.

Monday, August 27, 2007

మా వైద్యుడు...అప్పిచ్చువాడు...నగరం

 అప్పిచ్చువాడు....వైద్యుడు వున్న వూరిలో వుండాలని పెద్దలెపుడో చెప్పారు.

అలానే అనుకుని పాపం అమాయక ప్రజలు నమ్మారు...

కోకొల్లలుగా వూరిలో మకాం పెట్టేసారు...

వూరిని నగరంగా మార్చేసారు....

నగరంగా మారిన వూరు కూడా ఒళ్లు విరుచుకుని గర్వపడింది....దాని రాబడి కూడా పెరిగింది.

దాంతో నగరం పక్కదారులు పట్టింది.

ఇక వైద్యుడు తన అసలు పని మానేసి రాజకీయాలలో ఆరితేరాడు..

ప్రజలు తనను నమ్ముకున్నారనే విషయాన్ని పూర్తిగా మర్చాడు.

క్రమంగా అందరూ రాజకీయులే ఆ నగరానికి అన్ని దిక్కులయ్యారు...

ఏడీ వైద్యుడు కనిపించడే....అలా అని ఉన్న వూరిమీద మమకారం ప్రజలను వదలదే...

ఆ మమకారంతో ప్రజలు నగరాన్ని వదలటం లేదు...

అప్పిచ్చువాడు..అప్పు ఇస్తూనే నగరాన్ని దోచుకోవటం మొదలుపెట్టాడు...కుటుంబాలు చితికిపోయాయి

నగరానికి పట్టిన రోగంలో మాడి మసయిపోయిన ప్రజలను పట్టించుకునే వైద్యుడు ఎలాను లేడు...ఇంకేముంది నగరంలో కొల్లొలుగా రాబందులు తయారయ్యాయి.

శవాలపైన ఎగరుతూ వారి బంధువులను ఓదార్చడమే పనిగా పెట్టుకున్నాయి.

వైద్యుడు ఇప్పుడు కొత్త అవతారం ఎత్తాడు....ప్రస్తుతం వైద్యం మానేసి పోష్టుమార్టమే చెయ్యటం మొదలెట్టాడు

ఇప్పుడు అతడు ఎవరు ఎందుకు చనిపోయారో మాత్రమే చెప్పగలడు...అతికష్టం మీద...

రక్షించు మహాప్రభో అంటే...ఎక్కడో దేహంలో దాడి జరిగితే నా కళ్లకు ఎలా కనిపిస్తుంది అని అమాయకంగా అడుగుతాడు..

నేను వైద్యం చెయ్యలేనందుకు .... నీకు ఎక్స్ గ్రేషియా ఇస్తానంటాడు.

ప్రజలు పైన పెద్దలు చెప్పిన పద్యాన్ని మరొకసారి చదువుకున్నారు.

ఏమీ తోచలేదు...ఎక్కడకు పోవాలో సమఝవ్వలేదు...

మన బతుకింతే అని పద్యాన్ని మార్చి రాసేసుకున్నారు...

పిల్లలకూ అదే నేర్పారు...

అమ్మా, నాన్నలతో వుంటే అన్నింటి కంటే సురక్షితమనుకునే పిల్లలకు ఇవి అర్ధం కాలేదు.

వారు పెద్దయ్యాక కూడా ఇంకా వారు పాత పద్యాన్నే నమ్మసాగారు...

నగరం మాత్రం నవ్వుతూ తన శరీరాన్ని అమ్ముకుంటూ పెంచుకుంటూనే వుంది.

దానికిప్పుడు ఈ రోగాలు పెద్దగా పట్టవు...వైద్యుడి అవసరం అంతకన్నా లేదు....

Saturday, August 25, 2007

ఇదేనా భాగ్య నగరం ?

దాదాపు నలభై మంది వరకూ మృతి. వంద మందికి పైగా క్షతగాత్రులు...

బాధితులను అన్ని రకాలుగా ఆదుకుంటాం, ఐదు లక్షల ఎక్స్ గ్రేషియా ..ఇవీ ఈ నగర ప్రజల వినే ప్రభుత్వపు చివరి పలుకులు.

బహుశా వారి పని కావచ్చు...బహుశా వీరి పని కావచ్చు..ఇవి పోలిసుల అరిగిపోయిన రికార్డులు...

ఇది పిరికిపందల చర్య ...పనికి రాని కేంద్రం..

ఛీ మనదీ ఒక సమాజమేనా? ఇక్కడ ప్రాణాలకు విలువ ఐదు లక్షలా? అన్ని రకాల ఇంటలిజెన్స్ నివేదికలూ పోలీసులను ముందుగానే హెచ్చరిస్తాయి..గానీ అక్కడ వినటానికి నిజమైన పోలీస్ వుంటేగా...ప్రతీ ఒక్కడు ఎన్నెన్ని లక్షలు పోసి ఇక్కడకు పోస్టింగులు చెయ్యించుకుంటారో చెత్తనా వెధవలు....అందరూ వాళ్లే వుంటే ఇక నిజమైన పోలీసులు ఎక్కడ? ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నట్లు ప్రభుత్వానికి ఎప్పుడు పడుతుంది?

పేలుడు తరువాతి దృశ్యాలు చూస్తుంటే అసలు మన దేశంలో క్రైమ్ సీన్ అనే దానికి అర్ధం వుందా? అనిపించింది. శవాల మధ్యన తిరుగుతున్న పది పదిహేను జతల కాళ్ళు...ఏ క్లూ ఎవడి కాళ్ల క్రింద నలిగిపోతుందో అర్ధం కాదు. ఒక పోలీస్ సెక్యూరిటీ లైన్ అంతకంటే లేదు.

అంబులెన్సులు గంట తరువాత వచ్చాయి....మరి ఎలా రాగలవు? మనది అద్భుతమైన ట్రాఫిక్ కదా? ఎలా వస్తాయి?

సీ.యన్.యన్ ఐబి యన్ ఒక్క ముక్కలో మన నగర పరిస్థితి చెప్పింది.... హైదరాబాదుకు సెక్యూరిటి కల్చర్ లేదు.

అవును ఒప్పుకోవాల్సిందే...అస్సలు లేదు.

తమకు సంబంధించని వైషమ్యాలలో, తమకు తెలియని సమాజం జరిపిన దాడిలో, తమకు తెలిసేలోపే అమాయకంగా ప్రాణాలు పోగొట్టుకున్న మన  సమాజ పౌరులకు సిగ్గుతో తలవంచుకుని శ్రద్ధాంజలి అర్పిస్తున్నాను.

Friday, August 24, 2007

మన రాజధానికే ఇవి సొంతం....పోటీయే లేదు

మన భాగ్యనగరానికే సొంతం అయిన అవలక్షణాలలో ఆణిముత్యాల లాంటి నాలుగు అవలక్షణాలను నేను ఈ మధ్య సరదాగా నా సెల్ ఫోన్ తో క్లిక్కు మనిపించా...వీటిలో కొన్ని ప్రజల ప్రాణాలను బలిగొన్నాయి, ఇంకా చాలా మంది సామాన్యుల జీవితాలతో చెలగాటమాడుతూనే వున్నాయి. అయినా "నాకేంటంటా? అహ...నాకేమిటంట?" అనే రకంగా వున్న ప్రభుత్వ వ్యవస్థ పిల్లి నిద్ర పోతూనే వుంది.

౦౧. మహానగరపు అమీర్ పేట సార్వత్రిక విశ్వవిద్యాలయం జడల మర్రి

బ్యానరు కడతారు....కొద్ది రోజులలో కొత్త కోర్సు వస్తుంది....బ్యానరు విప్పరు...తెంపుతారు...కొత్తది కడతారు. ఇలా తాళి మీద తాళి ఈ స్థంభానికి కడుతూనే వుంటారు. ఎప్పుడు ఏ అగ్ని ప్రమాదం జరుగుతుందో తెలియని పరిస్థితి.

౦౨. ప్రత్యక్ష నరక ప్రాయమైన ట్రాఫిక్

 ప్రపంచంలోనే అతి విచిత్రమైన ట్రాఫిక్. రోడ్లు విశాలంగా వుంటే ట్రాఫిక్ పోలీసులు కనిపించరు. వున్నా వారికి సగానికి పైగా రూల్స్ తెలియవు. వారికి తెలిసి ఎవరిని ఆపినా ఎవరూ ఆగరు...పారిపోతారు. అడ్డంగా కట్టి పడేసిన మసీదులు, గుడులు, సమాధులు ఈ నరక ప్రగతికి సోపానాలు.

౦౩. కబ్జా కింగుల కనక సింహాసనం

ఎక్కడ చెరువుంటే, సముద్రముంటే అక్కడ నాగరికతా, ప్రకృతి వెల్లివిరుస్తాయి. ఇక్కడ మాత్రం డంపింగు విరిసి కురుస్తుంది. ఆనక ఆ చెరువుని మెల్లగా కప్పేస్తుంది. కబ్జా చేస్తుంది.

౦౪. అధికారుల ధన దురాశాపరత్వం : గ్రేటర్ మెగా యాడ్ సిటీ

మీరు ఒక గంట రోడ్డు మధ్య కదలకుండా నిల్చుంటే, మీ వీపు భాగాన్ని బల్దియా జాలిమ్ లోషన్ వారికి యాడ్ అతికించుకోవటానికి అద్దెకిచ్చేస్తుంది. నగరమంతటా యాడ్లే. ఫుట్ ఓవర్ వంతెనలు కూడా వదలరు. చెట్లు నాటితే ఏమొస్తుంది నా బొంద...యాడ్లు నాటుదాం రండి. రాత్రింబవళ్ళు విద్యుత్తు సరఫరా కూడా వుంటుంది. యాడు వున్నా లేకున్నా సరే...

Thursday, August 23, 2007

శ్వేత భారతీయ సౌందర్యం

ఈ మధ్య నేను నిశితంగా గమనిస్తున్నవి వివిధ రకాల ప్రకటనలు. నాకీ అలవాటు అమూల్ ప్రకటనల పట్ల ఇష్టంతో మొదలయ్యింది. అమూల్ ప్రకటనలు అత్యంత భారతీయంగా చూడగానే నవ్వొచ్చే సమకాలీన అంశాలను పేరడీ చేస్తూ చాలా బాగుంటాయి. అలా మొదలయ్యిన ఇష్టం అమెరికాలో ప్రకటనలు చూసాకా ఇంకా ఎక్కువయింది. అయితే ఈ మధ్య మన దేశంలో వస్తున్న టీవీ, హోర్డింగుల ప్రకటనలు చూస్తే చాలా బాధగా వుంది. అసలు ఈ ప్రకటనలపై ఒక సెన్సారు బోర్డు వుందా లేదో నాకు తెలియదు కానీ...వుంటే బాగుండునేమో అనిపిస్తుంది. కొన్ని యాడ్లు ఆగి చూస్తే గానీ అర్ధం కావు. మరికొన్ని కొన్ని వర్గాలను తీవ్రంగా అవమానిస్తు వుంటాయి. జాగ్రత్తగా అలోచిస్తే గానీ అవి అర్ధం కావు.

ముఖ్యంగా ఫెయిర్నెస్ క్రీముల ప్రకటనలు. ఈ ప్రకటనలు ఎంతకు తెగిస్తున్నాయంటే నలుపు అనేది అందవికారానికి చిహ్నం అని నూరిపోసేంతగా.. ఒక క్రీము కంపనీ ఒక నల్లని అమ్మాయిని చూపించి...ఆమెని మైకేల్ జాక్సన్ తెలుపుకు క్రమంగా తెచ్చి "అందమే ఆత్మ విశ్వాసం" అని డప్పు కొడుతుంది. ఫెయిర్ నెస్ అంటే "తెలుపు" రంగనుకునే బ్రిటీష్ కాలపు బానిసత్వం నుంచి ఎప్పుడు బయటపడతాం?

ఇంకొక క్రీము కంపనీ...మగవాళ్లు ఆడవారి క్రీమ్ వాడటమా అని హేళన చెయ్యటం. స్త్రీల మీద వారి వుద్దేశ్యమేంటో అర్ధం కాదు. అసలు ఈ క్రీముల వలన చర్మంలోని మెలనిన్ శాతాన్ని తగ్గించగలం అని ఇప్పటివరకూ ఎవడు ఇతమిధ్ధంగా నిరూపించలేకపోయారు. ఈ మధ్య ఒక సర్వే ప్రకారం తెలిసిందేంటి అంటే ఆసియన్లకు తెలుపు మీద వెర్రి ప్రేమ అని, అదే అమెరికన్ తెగలకు కాంతివంతమైన చర్మం మీద అధికమని. ఈ కారణం మీద అన్ని ప్రకటనలు ఇప్పుడు "తెలుపు" మంత్రాన్ని "అందానికి" అందలంగా చూపిస్తున్నాయి, డబ్బులు పిండుకుంటున్నాయి. మన దేశంలో ఈ దరిద్రమైన  ఆర్యన్ దేహ "అందపు" నిర్వచనానికి బలం చేకూర్చే ఎటువంటి పనినైనా ప్రభుత్వం సెన్సారు చెయ్యాల్సిన పని వుంది. లేకపోతే ఇప్పటికే తెల్లవాళ్లకు అమ్ముడు పోయిన ఆత్మ గౌరవపు చివరి ఎంగిలి మెతుకుల్ని కూడా "తెలుపు" రంగు పేరిట చాలా మంది కోల్పోయి అందుకు నల్లగా పుట్టాన్రా బాబు అని బాధపడుతూనే వుంటారు.

Thursday, August 16, 2007

గూగుల్ తెలుగు ఆన్ లైన్ కీ బోర్డు

ప్రస్తుతానికి ఇది చాలా సాదాగా వుంది. ఐగూగుల్ మాడ్యూల్ గానే లభ్యం అవుతుంది. దిగువ చూపిన లంకె నుంచి దీనిని మీరు మీ గూగుల్ హోమ్ పేజీకి జత చెయ్యవచ్చు.

Indic On-Screen Keyboard iGoogle Gadgets

Tuesday, August 14, 2007

నోకియా బాంబులు...మీ దగ్గరా వున్నాయా?

నోకియా బ్యాటరీల పేలుడు వార్తలు విన్నారా?

మీరు గనక క్రింద ఇవ్వబడిన మోడల్ నోకియా మొబైల్ ఫోన్ వాడుతున్నట్టయితే వెంటనే ఒక్క సారి మీ బ్యాటరీ మోడల్ చూడండి.

Nokia 1100, Nokia 1100c, Nokia 1101, Nokia 1108, Nokia 1110, Nokia 1112, Nokia 1255, Nokia 1315, Nokia 1600, Nokia 2112, Nokia 2118, Nokia 2255, Nokia 2272, Nokia 2275, Nokia 2300, Nokia 2300c, Nokia 2310, Nokia 2355, Nokia 2600, Nokia 2610, Nokia 2610b, Nokia 2626, Nokia 3100, Nokia 3105, Nokia 3120, Nokia 3125, Nokia 6030, Nokia 6085, Nokia 6086, Nokia 6108, Nokia 6175i, Nokia 6178i, Nokia 6230, Nokia 6230i, Nokia 6270, Nokia 6600, Nokia 6620, Nokia 6630, Nokia 6631, Nokia 6670, Nokia 6680, Nokia 6681, Nokia 6682, Nokia 6820, Nokia 6822, Nokia 7610, Nokia N70, Nokia N71, Nokia N72, Nokia N91, Nokia E50, Nokia E60

అది బీ యల్ - ఐదు సీ (BL-5C) అయితే కనుక వెంటనే ఇక్కడ చూపిన విధంగా మీ బ్యాటరీ సీరియల్ నంబరుతో ఒక్క సారి సరి చూడండి.

మీ బ్యాటరీ కనుక పేలే సంభావ్యత వున్నట్టుగా తేలితే, దగ్గరలో వున్న నోకియా షోరూం (హైదరాబాదులో అయితే సోమాజిగుడ) దర్శించితే మీకు కొత్త బ్యాటరీ లభిస్తుంది.

మొబైల్ వంక భయంగా చూడటం మాని, తొందరగా కొత్త బ్యాటరీ తెచ్చుకోండి మరి...

Sunday, August 12, 2007

నా బ్లాగ్నిశ్సబ్ధం

దాదాపు నెల తరువాత మరలా నా బ్లాగు ప్రపంచంలోనికి అడుగుపెట్టాను. (హడావిడిలో రాసిన క్రింది టపాను మినహాయించితే) గత నెల రోజులుగా నేను ఎందుకు ఒక్క టపా కూడా రాయలేకపోయానంటే అందుకు పెద్దగా కారణాలు కనిపించటంలేదు :-) పని ఒత్తిడి కొద్దిగా పెరిగింది. బహుశా సియాటిల్ లో స్నేహితులు నన్ను తెగ తిప్పి అన్నీ చూపించటం వలన వచ్చిన అలసటా కావచ్చు. నా బద్ధకం వలన ఎవరి వ్యాఖ్యలైనా వెంటనే అప్రూవ్ చెయ్యలేక పోయిండవచ్చు, తిరిగి నా అభిప్రాయాలు రాయలేక పోయి వుండవచ్చు. (కొంతమంది దీనిపై నన్ను విమర్శించారు కూడా...:-)). అందుకు నన్ను క్షమించ కోరుతున్నాను.

కానీ మరొక్క సారి నేను కొన్ని విషయాలు చెప్పదలచు కున్నాను.

01. ఈ బ్లాగు లో నేను రాసిన ఏ విషయమైనా పూర్తిగా నా భావం మాత్రమే. అది అందరికి నచ్చుతుందని గ్యారంటీ నేను ఇవ్వలేను. నా బ్లాగే కాదు ...ఏ బ్లాగు అది ఇవ్వదు.

02. ఇక నా బ్లాగులో వ్యాఖ్యానాలు అవి రాసిన వారి సొంతం. నాకు ఏ మాత్రము సంబంధమూ లేదు. అయితే పరస్పర దూషణలకు ఈ బ్లాగు వేదిక కాకుండా చిన్న జాగ్రత్త తీసుకునేందుకు "అనామిక" వ్యాఖ్యలను చాలా వరకు కత్తిరించదలచుకున్నాను. అలానే డిగ్నిటీ లేనివి కూడా...:-) నన్ను తిట్టాలంటే మీరు నాకు ఒక ఈలేఖ (సుధాకర్ @ జీ మెయిల్) రాసి పడెయ్యండి.

అదండీ సంగతి...
About Us | Site Map | Privacy Policy | Contact Us | Blog Design | 2007 Company Name